టీవీ నటి తునిషా శర్మ సూసైడ్ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ కేసులో వాలివ్ పోలీసులు కీలక విషయాన్ని బయటపెట్టారు. ఆత్మహత్యకు ముందు తునిషా, షీజామ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
ఘటనా ప్రాంతంలో పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ లను సేకరించారు. అందులో తునిషాతో షీజాన్ వాగ్వాదానికి దిగినట్టు రికార్డు అయ్యాయి. ఈ నేపథ్యంలో షీజాన్ పురికొల్పడంతోనే తునిషా ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు బలం చేకూరింది.
దీంతో తునిషా, షీజాన్ మొబైల్ ఫోన్ల డేటాను బయటకు తీసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. దీంతో కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. షీజాన్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.
తునీషాను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై ఆమె మాజీ ప్రియుడు షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తునీషాకు, షీజన్ ఖాన్ కు మధ్య జరిగిన 15 నిమిషాల సంభాషణ ఆమె ఆత్మహత్యకు దారితీసిందని వాలీవ్ పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుని పోలీసు కస్టడీకి పంపారు. తాజాగా షీజన్ రిమాండ్ ను శనివారం వరకు పొడిగించినట్టు సమాచారం.