ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లు ప్రాధమిక హక్కు కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై లోక్ సభలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో సభ వాయిదాకు దారి తీసింది. సుప్రీంకోర్టు తీర్పు సరైనది కాదని విపక్షాలు అనడంతో అధికార బీజేపీ దాని మిత్ర పక్షాలు విపక్షాలపై విరుచుకుపడ్డాయి. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చేసేదేమి లేదని ప్రకటించాయి. బీజేపీ, దాన్ని నడిపించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాధమికంగానే రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.
అనంతరం సామాజిక న్యాయ శాఖ మంత్రి తోవర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ కోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమి లేదని..అలా కావాలని కూడా కోరుకోలేదన్నారు. ” విషయాన్ని అధ్యయనం చేస్తున్నామని..దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పారు. కోర్టు తీర్పు 2012 లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధముందని అన్నారు. ఉత్తరాఖండ్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించలేదన్నారు.