భార్య భర్తల మధ్య గొడవలు, వాటికి అనుగుణంగా సర్ధుకు పోవడం సహజం. కానీ అవి మితిమీరితే పలు అనార్ధాలకు దారి తీస్తాయి. అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్య ప్రాణం తీసే వరకు దారి తీసింది. భర్త క్షణికావేశం భార్యపై హత్యాయత్నానికి దారితీసింది. ఆగ్రహానికి లోనైన భర్త.. భార్యను కత్తి పొడిచాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని సుధీర్ కుమార్ కాలనీలో రేణుక, వెంకటేశ్ దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రేణుక వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్త పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. కుటుంబం గడవడానికి ఇబ్బంది కావడంతో భర్తను పనికి వెళ్లాల్సిందిగా రేణుక సూచించింది.
ఇలా భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి వారి మధ్య గొడవ మొదలైంది. మాటా మాటా పెరిగింది. ఓపిక నశించిన వెంకటేష్.. భార్య రేణుకను చాకుతో పొడిచాడు. ఈ దాడిలో రేణుకకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న భర్త వెంకటేశ్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. గాయాలైన రేణుక ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నట్టు పోలీసులు తెలిపారు.