కోతి చేష్టలని ఊరికే అంటారా..?! ఊరి మీద పడిన కోతుల గుంపు, దేవుడికి పెట్టిన దీపంతో ఓ గుడిసెను తగులబెట్టాయి. ఓ కుటుంబాన్ని కట్టు బట్టలతో రోడ్డు మీద నిలబెట్టాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని 21 వ వార్డులో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇంటి మేడపై మేదరి ఎల్లయ్య గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. ఉదయం ఇంట్లో పూజలు చేసుకుని కుటుంబం బయటకు వెళ్ళగా కోతులు ఇంట్లోకి చొరబడి పూజగదిలోని దీపాన్ని చెల్లాచెదురు చేయడంతో గుడిసెకు నిప్పంటుకుంది.
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న 2 లక్షల నగదు, 2 తులాల బంగారం, నిత్యావసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.
కట్టు బట్టలతో మిగిలిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు కౌన్సిలర్ నాగిరెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకుని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని తెలిపారు.