ఉత్తర ప్రదేశ్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో మరో దారుణం వెలుగుచూసింది. విచక్షణ రహితంగా వాహనాలు నడిపిన దుర్మార్గులు రైతులనే కాదు జర్నలిస్టును కూడా పొట్టనబెట్టుకున్నారు.
లఖింపూర్‌లో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో నిఘాసన్‌కి చెందిన జర్నలిస్ట్ రామన్ కశ్యప్ కూడా అక్కడే ఉన్నాడు. పక్కనే ఉండి నిరసన దృశ్యాలను చిత్రీకరిస్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన మంత్రి కుమారుడి వాహనం ఢీకొనడంతో రామన్ కశ్యప్ రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయాడు. జర్నలిస్ట్ మృతదేహాన్ని ఆ తర్వాత ఆసుపత్రిలో కనుగొన్నారు.
రామన్ కశ్యప్ సాధనా న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. పిల్లలిద్దరూ ఇంకా చిన్నవారే. చిన్న అమ్మాయిది ఇంకా పాలు తాగే వయసే. ఘటనపై స్థానిక జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రామన్ కశ్యప్ మృతిపట్ల ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియా ధీరజ్ గుప్తా, శిశిర్ శుక్లా సీనియర్ అధికారులతో సహా వందలాది మంది జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.