హిందువుల తండ్రుల కుమార్తెలు వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే వారి సంపాదనతో పాటు… ఇతర ఆస్తులను వారసత్వంగా పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వచ్చిన పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం హిందూ మహిళలు మరియు వితంతువుల ఆస్తి హక్కులకు సంబంధించిన ఈ తీర్పు సంచలనం అయింది.
మరణించిన తండ్రికి ఉన్న సోదరుల కుమారులు మరియు కుమార్తెల మాదిరి కుటుంబంలోని ఇతర కొలేటరల్ సభ్యుల కంటే… సదరు వ్యక్తి కుమార్తెలకు ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తుందని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. మరే ఇతర చట్టపరమైన వారసుడు లేనప్పుడు, తన తండ్రి స్వీయ-ఆర్జిత ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కుమార్తెకు కల్పించింది సుప్రీం కోర్ట్. ఎప్పటి నుంచో ఉన్న ఈ చట్టపరమైన సమస్యను బెంచ్ పరిష్కరించింది .
అటువంటి ఆస్తి తండ్రి మరణించిన తర్వాత కుమార్తెకు బదిలీ అవుతుందా లేదా ఇతర చట్టబద్ధమైన వారసులు లేనప్పుడు జీవించి ఉన్న తండ్రి సోదరుడి కుమారుడికి బదిలీ చేయబడుతుందా అనే ప్రశ్నను కూడా సుప్రీంకోర్టు సమాధానం చెప్పింది.ఒక మహిళా హిందువు వీలునామా లేకుండా చనిపోతే, ఆమె తండ్రి లేదా తల్లి నుండి ఆమెకు సంక్రమించిన ఆస్తి ఆమె తండ్రి వారసులకు చెందుతుందని కోర్టు పేర్కొంది. ఆమె భర్త లేదా మామగారి నుండి ఆమెకు సంక్రమించిన ఆస్తి భర్త వారసులకు చెందుతుంది.