జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో అసలు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఆధారాలు బయటపెట్టడంతో కీలక భేటీ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్బీ , లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులతో పాటు పలువురు హుటాహుటిన సమావేశమయ్యారు. అసలు నిందితుల వీడియోలు, ఫోటోలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. రఘునందన్ రావుకి అవి ఎలా చేరాయనే దానిపై లోతుగా చర్చిస్తున్నారు.
బాధితురాలు మైనర్ కావడంతో సుప్రీం ఆదేశాల మేరకు ఆమె ఫోటో, వివరాలు చెప్పలేదు రఘునందన్. రెడ్ కలర్ కారులో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ చేయించాలన్నారు. పీఎస్ లో, పబ్ లో సీసీ ఫుటేజ్ ఏమైందని ప్రశ్నించారు. నిందితుల ఫోటోలను ఎందుకు సీక్రెట్ గా ఉంచారని.. నిర్భయ కేసులో మైనర్ ఉన్నా చూపించలేదా? అంటూ నిలదీశారు.
అధికార పార్టీ, డబ్బులు ఉన్నవారి పిల్లలనే బయటకు చూపించడం లేదా? అని అడిగారు రఘునందన్. హైదరాబాద్ లో పోలీస్ కంట్రోలింగ్ అంతా మజ్లిస్ చేతిలో ఉందని.. పోలీసులను ఎంఐఎం పెద్దలు ఆడిస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లను రిమాండ్ చేస్తారు కానీ.. ఎంఐఎం వాళ్లను టచ్ చేయరని వ్యాఖ్యానించారు. తాను చూపిస్తున్న ఫోటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక భేటీ నిర్వహించారు.