కేరళలో దారుణం చోటు చేసుకుంది. కోజికోడ్ జిల్లాలో హోటల్ యజమానిని ఇద్దరు స్నేహితులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శ్రద్దా వాకర్ హత్య కేసు తరహాలో ఆ వ్యాపారి మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం ట్రాలీ బ్యాగులో తీసుకు వెళ్లి అటవీ ప్రాంతలో విసిరేశారు.
ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం… మలప్పురం జిల్లా తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్ (58) హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనకు కోజికోడ్‌లోని ఒలవన్నాలో ఓ హోటల్ వుంది.
దీంతో హోటల్ వ్యాపారం చూసుకుంటూ కుటుంబ సభ్యులకు దూరంగా ఒలవన్నాలోనే ఉంటున్నాడు. ఈ నెల 18న కోజికోడ్‌లోని ఎరంజిపాలెంలోని ఓ హోటల్లో రెండు గదులు బుక్ చేశాడు. అదే హోటల్లోనే పాలక్కడ్‌కు చెందిన నిందితులు శిబిల్ (22), అతడి స్నేహితురాలు ఫర్హానా (18) కూడా రూం తీసుకున్నారు.
ఈ క్రమంలో సిద్ధిఖ్‌కు అతని కుమారుడు ఫోన్ చేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా సిద్దిఖీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అదే సమయంలో ఏటీఎం నుంచి భారీగా డబ్బులు డ్రా చేసినట్టుగా అతని ఫోన్ కు మెసేజ్ లు వచ్చాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సీసీ టీవీ పుటేజ్ పరిశీలించారు. నిందితులతో పాటు సిద్ధిఖ్ కుడా హోటల్లోకి వెళ్తన్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది. మే 19న శిబిల్, ఫర్హానా ఓ ట్రాలీ బ్యాగ్‌తో కిందకు వస్తున్నట్టు కనిపించింది. ఈ క్ర మంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
సిద్ధిఖ్ నిర్వహిస్తున్న హోటల్లో శిబిల్ 15 రోజులు పనిచేశాడు. శిబిల్ ప్రవర్తన నచ్చక అతన్ని పనిలో నుంచి సిద్దిఖీ తొలిగించాడు. ఈ క్రమంలోనే సిద్దిఖీని శిబిల్, అతని స్నేహితురాలు కలిసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
పనిలో నుంచి తొలగించినందుకు పగ పెంచుకుని హత్య చేశాడా లేదా వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధిఖ్‌ను నిందితులు ఆరు రోజుల ముందే హత్య చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఎరంజిపాలెంలో సిద్దిఖీ ఎందుకు గది తీసుకున్నారు? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిఖీ రెండు గదులు తీసుకోవడం కూడా అనుమానం కలిగిస్తోంది. ఘటన వెనుక హనీ ట్రాప్ ఏమైనా ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిఖీ అకౌంట్ నుంచి లక్షల రూపాయలు విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. అవి సిద్దిఖీ డ్రా చేశాడా లేదా వేరే ఎవరైనా డ్రా చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.