జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. గ్రానైట్ తీసుకు వెళ్తున్న లారీ అదుపుతప్పి చెట్టను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ హరిందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా, వాహనం నడుపుతున్న డ్రైవర్ లారీలోనే చిక్కుకు పోయాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా వైపు ఓ లారీ గ్రానైట్ లోడుతో వెళ్తుంది. మేడిపల్లి శివారులో లారీ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. లారీ డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. లారీలో విలవిల్లడాతున్న డ్రైవర్ ను స్థానికులు నానా ఇబ్బందులు పడి బయటకు తీశారు.
ఈ ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్ కాలు తీసేయాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం అతనికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.
అనంతరం పోలీసులు డ్రైవర్ బంధువులకు సమాచారం అందించారు. డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.