సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఘోరం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ మూడు అమాయక ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో హర్యానా నుండి చిత్తూరు వెళుతున్న బియ్యపు లారీ అదుపు తప్పింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
అయితే వీరిని బాహ్య వలయ రహదారి పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోసే కార్మికులు బాబు రాథోడ్ ( 48 ) కమలీ భాయ్ (43) రాథోడ్ (23) లుగా గుర్తించారు. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు పేర్కొన్నారు. మరో వైపు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.