సాధారణంగా ఎవరైనా పార్టీలకు వెళ్తే.. ఫుల్‌గా తింటారు.. తాగుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం బంగారు ఆభరణాలు మింగేశాడు. ఈ విచిత్రమైన ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో చోటుచేసుకుంది. ఫుల్‌గా తాగి ఈద్ పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి ఆ మైకంలో బిర్యానీతో పాటు రూ.1.45లక్షల విలువ చేసే నగల్నీ మింగేశాడు. చివరకు వైద్యులు ఎనిమా ఇచ్చి అతడి పొట్టలోంచి నగల్ని బయటకు తీశారు. మే 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నగల దుకాణంలో పనిచేసే ఓ మహిళ రంజాన్ సందర్భంగా.. ఈ నెల 3న తన ఇంట్లో ఈద్ పార్టీకి స్నేహితురాలితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌నీ ఆహ్వానించింది. అందరికీ మందు, విందు ఏర్పాటు చేసింది. విందు పూర్తయి.. అతిథులంతా వెళ్లిపోయారు. ఆ తర్వాత తన ఇంట్లో కబోర్డులోని డైమండ్ నెక్లెస్, ఓ పెండెంట్, బంగారు చైన్ పోయిందని ఆమె గుర్తించింది.
వెంటనే పార్టీకి వచ్చిన అతిథులను సంప్రదించింది. అప్పటికీ తెలియకపోవడంతో చివరకు తన స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్‌పై అనుమానం వచ్చి విరుగంబక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని విచారించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కాన్ చేయించగా కడుపులో నగలున్నట్టు తెలిసింది. ఎనిమా ఇచ్చి పొట్టలో ఉన్న నగలను రికవరీ చేశారు. రూ. 95 వేలు విలువచేసే నెక్లెస్, రూ. 25వేల గోల్డ్ను పొట్టలో నుంచి బయటకు తీశారు. కానీ పెండెంట్ మాత్రం కడుపులోనే ఉండిపోయింది. మరో ఆపరేషన్ చేసిన దానిని కూడా బయటకు తీశారు వైద్యులు. అయితే, తాగిన మత్తులో నగలు మింగినట్టు అతను చెప్పడంతో ఆ మహిళ.. తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు తెలిపింది.