కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ అనగానే ఇప్పుడు జనం కూడా వణికిపోతున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా సరే… వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటున్నారు. అయితే ఈ కరోనా వైరస్ అనుమానమే ఏపీలో ఓ యువకుని ఆత్మహత్యకు కారణమైంది.
చిత్తూరు జిల్లాలోని శేషమనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన బాలకృష్ణ కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఆత్మహత్య చేసుకోవటం సంచలనం రేపుతోంది. కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నాడు బాలకృష్ణ. దీంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో వైద్యులను కలవగా… చికిత్స చేసి పంపించారు. అయినా ఆ జ్వరం తగ్గకపోవటంతో తీవ్ర ఆందోళన చెందాడు బాలకృష్ణ.
Advertisements
తనలో ఉన్న జ్వరం లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాలు ఒకేలా ఉన్నాయని తెలుసుకొని… తన తల్లితండ్రులను కూడా తన దగ్గరకు రానివ్వకుండా ఓ గదిలోకి వెళ్లి తనను తాను నిర్భందించుకున్నాడు. ఇదే మానసిక వేదన ఎక్కువ కావటంతో బాలకృష్ణ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూంలో నుండి ఎంతకు స్పందించకపోవటంతో తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు చూసే సరికి ఉరి వేసుకొని ఉన్నాడు.
వైరల్ ఫీవర్స్, జలుబు కరోనా వైరస్‌తోనే రాదని, ప్రతి వైరల్ ఫీవర్ కరోనా వైరస్‌తో వచ్చినట్లు కాదంటూ డాక్టర్స్ స్పష్టం చేస్తున్నారు.