హైదరాబాద్ లోని ప్రఖ్యాత చార్మినార్ వద్ద ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి విసిరేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వల్ల నగరంలోని గుల్జార్ హౌజ్ రోడ్డులో కార్లు, ఇతర వాహనాలపై వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి షాకయ్యారు. సదరు వీడియోలో కుర్తా, పైజామా ధరించిన ఓ వ్యక్తి గుల్జార్ హౌస్ ఫాంటెన్ వద్ద నిలబడి రూ.500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే.. తన బంధువుల వివాహ వేడుకల్లో భాగంగానే సదరు వ్యక్తి డబ్బుల నోట్లను గాలిలోకి విసిరేస్తున్నట్టు పలువురు చెప్తున్నారు. గుల్జార్ హౌజ్ ఫౌంటెన్ పైకి ఎక్కుతూ, దిగుతూ పలుమార్లు అతను గాల్లోకి నోట్లు విసిరాడు. దీనిని చూసిన స్థానికులు నోట్లు సేకరించేందుకు ఎగబడగా.. మరికొందరు మాత్రం ఈ దృశ్యాలను తమ ఫోన్ లలో బంధించడంలో బిజీ అయ్యారు.
అయితే.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనిపై మండిపడుతున్నారు. కొందరు ఈ వీడియో వాస్తవికతతో పాటు గాలిలోకి విసరబడ్డ నోట్లు అసలైన కరెన్సీనేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఎంత డబ్బుంటే మాత్రం ఇలా రోడ్లపై విసరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై చార్మినార్ ఏరియా ఇన్స్పెక్టర్ బీ.గురునాయుడు స్పందించారు. వారు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి పిర్యాదు అందులేదని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అలాగే దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని స్పష్టం చేశారు ఇన్స్పెక్టర్ గురునాయుడు.