కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. 24 గంటల విరామం తర్వాత సోమవారం భారత్ జోడో యాత్ర జలంధర్ జిల్లా ఉదం పూర్ నుంచి తిరిగి ప్రారంభమైంది. యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఓ వైపు చలి వణికిస్తున్నప్పటికీ లెక్క చేయకుండా నేతలు రాహుల్ వెంట నడుస్తున్నారు. ప్రస్తుతం యాత్ర హోషియాపూర్ లో కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రలో మంగళవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ కళ్లు కప్పి ఓ వ్యక్తి రాహుల్ గాంధీ దగ్గరికి చేరుకున్నాడు.
ఆ వ్యక్తి రాహుల్ గాంధీని కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అతన్ని అడ్డుకున్నాయి. వెంటనే అతన్ని పక్కకు నెట్టేశారు. అనంతరం రాహుల్ గాంధీ తన యాత్రను యథావిధిగా కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో యాత్రలో శనివారం ఎంపీ సంతోఖ్ సింగ్ మరణించారు. లూథియానాలో పాదయాత్ర సమయంలో ఆయనకు గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో యాత్రను శనివారం వాయిదా వేశారు.