వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వాళ్ల అమ్మకు ఫోన్ చేసింది. సైఫ్‌తో పాటు సీనియర్లు వేధిస్తున్న విషయాలను చెప్పుకొని బాధపడింది. దీనికి సంబంధించిన ఆడియో ఫైల్ ఇప్పుడు బయటకు వచ్చింది.
సైఫ్ నన్ను ఒక్కదాన్నే కాదు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని ప్రీతి తన తల్లితో చెప్పుకొని బాధపడింది. సీనియర్లంతా ఒక్కటిగా ఉన్నారని చెప్పింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకుంది.
సైఫ్ వేధింపులు రోజురోజుకీ ఎక్కువైపోయాయని తెలిపింది. సైఫ్ పై ఫిర్యాదు చేస్తే అంతా ఒక్కటై తనను దూరం పెడతారని ఆందోళన వ్యక్తం చేసింది.ఏదైనా ఉంటే తన దగ్గరకు రావాలని ప్రిన్సిపల్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని హెచ్‌వోడీ తన పై సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చింది.
ప్రీతి బాధను చూసి ఆమె తల్లి సైఫ్‌తో మాట్లాడతానని నచ్చజెప్పింది.కానీ ఆమె వినిపించుకోలేదు. ఆ కాల్ తర్వాత ఆత్మహత్యకు యత్నించింది. అయితే తన కూతురు ఆత్మహత్యకు యత్నించే అంత పిరికిది కాదని ప్రీతి తండ్రి చెప్పుకొచ్చారు.