నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు మాడవి హిడ్మ అలియాస్ ముక్క ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ముందు బుధవారం స్వచ్ఛందంగా లొంగిపోయాడు. చత్తీస్గఢ్ రాష్ట్రం, సుకుమా జిల్లాకు చెందిన కోయజాతికి చెందిన ముక్క.. 151 సీఆర్పీఎఫ్ అధికారులు కమాండెంట్ ప్రద్యుమ్న్ కుమార్ సింగ్, బిష్ణు చరణ్ మునకియ ద్వారా సరెండర్ అయ్యాడు.
అయితే.. తన తన 16 సంవత్సరాల వయసులో మావోయిస్టు పార్టీలో చేరినట్టు పోలీసులకు వెల్లడించాడు ముక్క. మిలీషియా గ్రూప్ కమాండర్ దూది కోస అనే వ్యక్తి.. పొలం దగ్గర పని ఉన్నదని తీసుకొని పోయి సీఎన్ఎం చైతన్య నాట్యమండలిలో చేర్చాడని తెలిపాడు. అక్కడ తనకు పాటలు, మాటలు నేర్పించారని.. ఆ తర్వాత తనను సీఎన్ఎం నుండి తీసి 2017 సంవత్సరంలో మిలీషియా గ్రూప్ లో చేర్చారని అన్నాడు. అక్కడ వారికి కావలసిన వంట సరుకులు తెప్పించడంతో పాటు.. వండిన వంటలు, సద్దిమూటలు మావోయిస్ట్ లు తనతో మోయించే వారని పోలీసులకు తెలిపాడు.
2018 లో రెవల్యూషన్ పీపుల్స్ కమిటీలో మిలీషియా మెంబర్ గా చేరినట్టు తాను వెల్లడించాడు. అప్పటి నుండి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు హిడ్మ చెప్పాడు. ఇప్పుడు తనకు మావోయిస్టు పార్టీ నుండి వేధింపులు ఎదురవుతున్నాయని అన్నాడు. ఈ నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకొని స్వచ్ఛందంగా లొంగిపోతున్నట్టు హిడ్మ స్పష్టం చేశాడు.
మావోయిస్టు దళ సభ్యులు లేదా మిలీషియా సభ్యులు ఎవరైనా ఉంటూ లొంగిపోయి మెరుగైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని అన్నాడు హిడ్మ. తమ కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసు వారిని సంప్రధించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నాడు హిడ్మ. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు ఓఎస్డీ శోభన్ కుమార్, ఏటూర్ నాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అమిత్ కుమార్, ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్, ఎస్సై రమేష్ తదితరులు ఉన్నారు.