వాయుశక్తి యుక్తి-2022 పేరిట పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధవిమానాలను గర్జించేందుకు భారత వైమానికదళం సిద్దమైంది. ఈ నెల 7 న జరిపే ఈ భారీ సైనిక డ్రిల్ లో 148 యుద్ధవిమానాలతో పాటు.. రాఫెల్ ఫైటర్లు కూడా పాల్గొనేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జైసల్మేర్ లోని పోఖ్రాన్ వద్ద జరగనున్న ఈ సైనిక డ్రిల్ కు ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరుకానున్నట్టు అధికారులు తెలిపారు.
75 ఫార్మేషన్స్‌లో 17 జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ లతో కార్యక్రమం ప్రారంభమవుతుందని భారత వైమానికదళానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాఫెల్, తేజస్, సుఖోయ్-30.. మూడు రకాల జెట్ లతో ‘ట్రాన్స్‌ఫార్మర్ ఏరోబాటిక్ డిస్‌ప్లే’ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు చినూక్, ఎంఐ17వీ5, ఎంఐ35, ఎల్‌సీహెచ్ వంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా ఈ వ్యాయామంలో పాల్గొననున్నాయని అన్నారు.
భారత వైమానిక దళం తన సంసిద్ధతను ప్రదర్శించేందుకు ప్రతి మూడేండ్లకోసారి వాయుశక్తి డ్రిల్ నిర్వహిస్తుందన్నారుర. ఈ డ్రిల్ ను చివరిసారిగా 2019లో నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 గంటలకు ముగియనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ డ్రిల్ లో పలు క్షపణుల సామర్ధ్యాన్ని ప్రదర్శించనున్నట్టు ఆయన తెలిపారు. అందులో ఆకాష్ క్షిపణి వ్యవస్థ, స్పైడర్ క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని డ్రిల్ లో ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. సీ-17, సీ-130 జే రవాణా విమానాలు కూడా ఈ ఎక్సర్ సైజులో భాగం కానున్నాయని అధికారులు స్పష్టం చేశారు.