హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. చాంద్రాయణ గుట్టలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు.
వివరాల్లోకి వెళ్తే.. చాంద్రాయణ గుట్టలో మందుల కోసం ఓ బాలిక మెడికల్ షాప్ కు వెళ్ళింది. ఈ తరుణంలోనే తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ అక్కడే ఉన్న ఓ మహిళ బాలికని ట్రాప్ చేసింది. బాలికను కందికల్ గేటు వద్దకు తీసుకువెళ్లిన మహిళ.. గంజాయి మత్తులో ఉన్న యువకులకు అప్పగించింది. ఆ మందులు వీరే ఇస్తారంటూ బాలికకు చెప్పింది.
ఇవి నమ్మిన ఆ బాలిక నలుగురు యువకుల వెంట వెళ్లింది. అంతే అక్కడ ఆ బాలికను తీసుకెళ్లి రూములో బంధించారు యువకులు. బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె అరుపులు వినిపించకుండా ఉండేందుకు మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ ను పెద్దగా పెట్టారు. అక్కడ నుంచి బయటబడ్డ ఆ బాలిక ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసారు బాలిక తల్లిదండ్రులు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పాటు ఐపీసీ సెక్షన్ 341, 342, 323, 376లతో పాటు ఫోక్సో యాక్ట్ కింద నలుగురు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురు నిందితులను పట్టుకుని జైలుకు తరలించారు.