భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరదనీరు చేరింది. 64 ఏళ్ల తర్వాత తొలిసారిగా పెద్దమొత్తంలో వరదనీరు చేరడం విశేషం. వరద ఉధృతితో ప్రాజెక్టు మనుగడే ప్రమాదకరంగా మారిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. భారీ వరదలతో కొన్ని రోజులుగా భయంతో వణికించిన కడెం ప్రాజెక్టుకు ప్రస్తుతం ముప్పు తప్పినట్లయింది. వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కడెం ప్రాజెక్ట్ ప్రమాదం నుంచి బయటపడింది. ఇన్ ఫ్లోకు తగినగట్లుగా ఔట్ ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు కట్టలపైనుంచి వరద ప్రవహించింది. దీంతో ప్రాజెక్టుకు ఎప్పుడు ఏమవుతుందోనని అంతా ఆందోళన చెందారు. పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ప్రస్తుతానికి వరద శాంతించడంతో ప్రాజెక్టుకు ప్రమాదం తప్పింది.
డ్యామ్‌ను డేంజర్ జోన్ నుంచి కాపాడేందుకు నీటి మట్టాన్ని 680 అడుగులకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు భారీ వరదల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్ద ఉండి పరిస్థితిపై సమీక్షించారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, ప్రాజెక్టును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు.
కడెం ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ ఫ్లో 2,50,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,90,000 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ కు ప్రమాద ముప్పు తప్పడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.