ఓ వివాహిత తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేఖ.. తన ఇద్దరు చిన్నారులు అన్షిక, అభిజ్ఞలను చెరువులోకి తోసి.. ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. అందుకు కుటుంబ కలహాలే కారణని గ్రామస్తులు చెప్తున్నారు.
చెరువులో తేలాడుతున్న మృత దేహాలను గుర్తించిన స్థానికులు ఇద్దరు చిన్నారులను వెలికితీశారు. రేఖ మృతదేహం లభ్యం కాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాల వల్లే రేఖ పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని రేఖ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసులో రేఖ భర్తను, వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
తనను రేఖ భర్తతో పాటు తమ కుటుంబ సభ్యులు మానసికంగా హింసించిన కారణంగానే బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు బాధితురాలి బంధువులు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.