నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. తెల్లవారు జామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో వెళ్తుండగా రామకృష్ణ కారుకు యాక్సిడెంట్ జరిగింది.
ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. కారును పక్కనే నిలిపి రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీ రామ్ లు కారు యాక్సిడెంట్ లోనే కన్ను మూశారు. ఇక తారక్ కు కూడా గతంలో కారు యాక్సిడెంట్ అయ్యింది.
ఇప్పుడు నందమూరి రామకృష్ణ కార్ కు యాక్సిడెంట్ అవ్వడం.. ఇవన్నీ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ గురించి కుటుంబ సభ్యులు ప్రకటించలేదు. పోలీసులు కూడా ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. యాక్సిడెంట్ కి గురైన కారుని కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారని సమాచారం.