బాపట్లలోని వేమూరు 2 సచివాలయ ఉద్యోగిని తోట సరళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరళ చనిపోవడానికి ముందు సరళ రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో ఆమె సచివాలయంలో పని ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.
ఇప్పటి వరకు ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు.. సూసైట్ నోట్ బయటకు రావడంతో అసలు విషయం తెలుసుకున్నారు. ఈ లేఖతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కొల్లూరుకు చెందిన తోట సరళ వేమూరు – 2 సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు. ఆమె గత నెల 24న బలవన్మరణానికి పాల్పడింది.
సచివాలయంలో పని ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఈ లేఖ బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. సరళతో పనిచేసిన తోటి ఉద్యోగులు సూసైడ్ లేఖను తీసుకుని స్థానికంగా ఉన్న ఎంపీడీవో, మండల స్థాయి అధికారులకు అందజేశారు. సరళ కుటుంబానికి అండగా ఉండాలని వినతి పత్రం అందజేశారు.
అయితే పని ఒత్తిడికి గల కారణాలపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ముందుగా ఆత్మహత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు… తాజాగా సూసైడ్ నోట్ బయటపడటంతో ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎవరిని బాధ్యులను చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.