సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. విచారణ సాగే కొద్దీ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతోంది.
ఇక ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మరోసారి ప్రశ్నించింది. ఇంతకు ముందు సీబీఐ ఆయనను రెండు సార్లు ప్రశ్నించింది. ఈ సారి విచారణ సందర్భంగా ఆయనను అరెస్ట్ చేస్తారని అంతా అనుమానించారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి కీలక అంశాలు బయటకొచ్చాయి.
వివేకా రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రక్రియలో ఆయన హత్య జరిగి ఉండొచ్చని వైసీపీ ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. 2010 లో షేక్ షమీమ్ అనే మహిళను వివేకా వివాహం చేసుకున్నారని.. రెండో వివాహంతో ఆయన కూతురు సునీతతో సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
ఆస్తులన్నీవాళ్లకి వెళ్ళిపోతాయని..రాజకీయ వారసులుగా వస్తారని.. సునీత భర్త రాజశేఖర్ కుట్ర చేశారన్నది తన అనుమానమని అన్నారు. అదే విధంగా తాను గుండెపోటు అని చెప్పినట్టు టీడీపీ చిత్రీకరించిందన్నారు. కుటుంబ సభ్యులు చెబితేనే తాను హత్య జరిగిన ఇంటికి వెళ్లానని పేర్కొన్నారు. తాను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే.. సీబీఐ అధికారులు సునీతకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి అన్నారు.
ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటి వరకు విచారించిన ఆడియో,వీడియో రికార్డులను హార్డ్ డిస్క్ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.