అదో కుగ్రామం. అక్కడ టీవీలు, సెల్ ఫోన్స్ ఏమీ ఉండవు. కనీసం కరెంట్ కూడా ఉండదు. కూడు, గుడ్డ, గూడు కోసం ఇతరులపై ఆ గ్రామస్తులు ఆధారపడరు. వారికి వారే సొంతంగా అన్నీ తయారు చేసుకుంటారు. ప్రకృతి తల్లి ఒడిలో హాయిగా సేదతీరుతున్నారు. ఆధునిక హంగులేవీ కనిపించవు. మల్లి ఇల్లులు మాత్రమే ఉంటాయి. ఈ గ్రామం శ్రీకాకుళంలోని హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపిస్తుంది. ఆ గ్రామాన్ని వారు కూర్మ అని పిలుస్తూంటారు. ప్రస్తుతం ఈ గ్రామం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
బాహ్యప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో వారికి సంబంధం ఉండదు. జీవిత పరమార్థం అవి కాదని భావించారు. ఈ కూర్మ గ్రామంలో 56 మంది నివాసముంటున్నారు. వారిలో 12 గృహస్తు జీవన కుటుంబాలు కాగా, 16 మంది విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారులు ఉంటారు. 2018లో జులైలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆదేశాలపై భక్తి వికాస్ స్వామి సారథ్యంలో ఈ పల్లె ఏర్పడింది.
సరళ జీవనం వీరి అలవాటు. అత్యవసరాలైన కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని సముపార్జిస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడిగా 198 బస్తాల ధాన్యం పండించారు. సరిపడా కూరగాయలు పండిస్తున్నారు. దంపుడు బియ్యాన్ని వండుకుంటున్నారు. దుస్తులను కూడా వారే నేరుగా నేసుకుంటారు.
ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయ, మెంతులు మిశ్రమంగా చేసి.. గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు కట్టుకున్నారు. కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు. సనాతన ధర్మం, వైదిక సంస్కృతి లక్ష్యంగా వారు చెబుతున్నారు. పిల్లలు గురుకుల పద్దతిలో విద్యనభ్యసిస్తున్నారు. సంస్కృతి, ఇంగ్లీషు, హిందీ, తెలుగులో అనర్గంగా మాట్లాడుతున్నారు. ఉదయం దైవ హారతితో వీరి దినచర్య మొదలవుతుంది. అనంతరం రోజువారీ పనులకు వెళ్తారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో మమేకమవుతారు. రాత్రిళ్లు దీపం వెలుగుల్లోనే జీవితం.
విద్యుత్తు ఉంటే దానిచుట్టూ సౌకర్యాలు పెరుగుతాయి. అందుకు డబ్బు అవసరం. యాంత్రిక జీవనంతో మనుషులూ యాంత్రికంగా మారతారు. మనసు కలత చెందుతుంది. అందుకే వాటికి దూరంగా ఉన్నామని వీరు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 56 మంది ఉంటున్నారు. వచ్చే ఐదేళ్లలో 50 కుటుంబాలు ఏర్పడతాయని వారు చెబుతున్నారు.