క్రమ క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. బౌతిక దూరం పాటించడంతో పాటు.. మాస్క్ తప్పనిసరిగా వాడాలని నిబంధనలు పెట్టాయి. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించే వారు కూడా మాస్కులు కచ్చితంగా పెట్టుకోవాల్సిందేనని రూల్ తీసుకొచ్చాయి.
కానీ.. కొంత మంది అజాగ్రత్తగా ఉంటూ భాద్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ లేకుండానే ఇతర దేశాలకు ప్రయాణాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా.. ఓ విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మాస్క్ పెట్టుకోవడానికి నిరాకరించాడు. దాంతో ఏకంగా విమానాన్నే వెనక్కి మళ్లించారు అధికారులు. ఈ ఘటన అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన జెట్ లైనర్ విమానంలో గురువారం చోటుచేసుకుంది.
129 మంది ప్రయాణికులతో మియామి నుంచి లండన్ కు బయలుదేరిన ఫ్లైట్ 38లో ఓ ప్రయాణికుడు మాస్క్ ధరించలేదు. దాంతో ఎయిర్ హోస్టెస్ సదరు వ్యక్తిని మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. కానీ.. ఆ వ్యక్తి మాస్క్ పెట్టుకోను అని ఖరాఖండిగా చెప్పేశాడు. దాంతో చేసేదేం లేక విమాన క్రూ.. విమానాన్ని తిరిగి మియామికి మళ్లించారు.
క్రూ సమాచారంతో ఎయిర్ పోర్ట్ లో సిద్దంగా ఉన్న పోలీసులు.. విమానం ల్యాండ్ అవగానే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ పెండింగ్ లో ఉందని అమెరికన్ ఎయిర్ లైన్స్ తెలిపింది. అంతేకాకుండా.. మాస్క్ పెట్టుకోని ఈ ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ లో ప్రయాణించకుండా నిరోధించబడిన వ్యక్తుల జాబితాలో ఉంచుతామని వెల్లడించింది ఎయిర్ లైన్స్.