పెంపుడు కుక్క విశ్వాసంగా ఉంటూ.. యజమాని ఏదైనా పారేసుకుంటే తెచ్చిస్తుంది. కానీ ఓ పెంపుడు కుక్క మాత్రం యజమానికి తేరుకోలేని ఝలక్ ఇచ్చింది. అతను నగదును దాచుకున్న సంచిని ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాచినపల్లి గ్రామానికి చెందిన కాసు చేరాలు అనే గొర్రెల కాపరి మందకు రక్షణగా ఉండటానికి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆయన సంపాదించిన డబ్బును ప్రత్యేకంగా కుట్టించుకున్న జోలె సంచిలో దాచుకుంటాడు. ఈ నెల 25న రాత్రి నడుముకు ఉన్న సంచి తీసి మంచంలో పెట్టి స్నానానికి వెళ్లాడు.
ఇంతలో పెంపుడు కుక్క ఆ సంచిని నోట కరుచుకుని వెళ్లి ఎక్కడో పడేసింది. అది తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు గమనించినా, ఏదోలే అని పట్టించుకోలేదు. బయటికి వచ్చిన చేరాలుకు మంచంపై బ్యాగ్ కనిపించకపోవడంతో వెదకడం మొదలుపెట్టాడు. కుక్క ఏదో పట్టుకుపోవడం చూశామని కుటుంబసభ్యులు చెప్పారు.
అయితే, అది డబ్బు సంచి అని అందులో రూ. 1.50 లక్షల డబ్బులు ఉన్నాయని చెప్పటంతో షాక్‌కి గురయ్యారు. అయితే, గంటల వ్యవధిలో కుక్క తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఎక్కడో పడేసి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులపాటు వెతికినా దొరకలేదు.గ్రామ పంచాయతీ వారు చాటింపు వేయించినా ఫలితం కనిపంచలేదు. దీంతో ఎత్తుకెళ్లిందని, ఎవరికైనా దొరికితే తనకు అప్పగించాలని బాధితుడు చేరాలు వాట్సప్ గ్రూప్‌లో పోస్టు చేశారు.