వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో బాధితులతో కలిసి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కాగా, ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయని సమాచారం. ఈ కేసు దర్యాప్తునకు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్‌రెడ్డి నేతృత్వంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కీలక వివరాలు వెల్లడించారు.
మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని,.. 164 స్టేట్మెంట్ రికార్టు చేయాల్సి ఉందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించినట్టు స్పష్టం చేసిన సీపీ.. నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
మహిళపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీని తీసుకోవడంతో పాటు బాధితురాలితో సాంకేతిక ఆధారాలు సేకరించి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
నాగేశ్వరరావు కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని, ఇంకా కొందరు సాక్ష్యులు ముందుకు వస్తున్నారని సీపీ వెల్లడించారు. సాక్షుల స్టేట్ మెంట్స్ తీసుకొని ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని మహేష్ భగవత్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా బాధితులుంటే.. ధైర్యంగా ముందుకు రావాలని మహేష్ భగవత్ అన్నారు.