‘ఆదిపురుష్’ టీమ్‌కు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాముడు, హనుమంతుడిని తోలు పట్టీలు ధరించి అనుచితమైన ధోరణిలో చూపించారని పిటిషన్ దారుడు ఆరోపణలు చేశారు.
రావణున్ని కూడా తప్పుగా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచే ‘ఆదిపురుష్’పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్ బాగోలేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. రాముడు, ఆంజనేయుడు, రావణున్ని తప్పుగా చూపించారంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ట్రోలింగ్‌పై దర్శకుడు ఓం రౌత్ వివరణలు ఇచ్చారు. ఈ సినిమాను పెద్ద స్క్రీన్ కోసం తీశామన్నారు. తమ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందన్నారు. కావాలంటే దీనిపై నోట్ కూడా రాసిస్తానన్నారు.
అంతకముందు హైదరాబాద్‌లో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రోలింగ్ పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం స్పందించారు. ఆదిపురుష్ టీమ్‌కు బాసటగా నిలిచారు. సినిమా ఏదైనా సరే సాధారణ ప్రేక్షకుడికి నచ్చితే చాలన్నారు. ఇలా ట్రోలింగ్ వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయన్నారు.