గుజరాత్ హైకోర్టు ఆన్ లైన్ హియరింగ్ లో ఓ పోలీసు అడ్డంగా బుక్కయ్యారు. ఓ కేసు విషయంలో మంగళవారం కోర్టులో సీరియస్ గా చర్చ జరుగుతోంది. వాది, ప్రతివాది లాయర్ల మధ్య వాదనలు సాగుతున్నాయి. ఈ సమయంలో ఇన్ స్పెక్టర్ ఏఎం రాథోడ్ కూల్ డ్రింక్ తాగుతూ జడ్జికి కనిపించారు. దాంతో అసహనానికి గురైన చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్.. వినూత్న శిక్ష విధించారు.
విచారణ మధ్యలో ఇలాంటి ఘటనకు పాల్పడినందుకు బార్ అసోసియేషన్ కు 100 కూల్ డ్రింక్ టిన్నులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తానని చెప్పారు.
గతంలో కోర్టులో ఆన్ లైన్ విచారణ సందర్భంగా సమోసా తిన్నందుకు ఒక న్యాయవాదిని తాను ఇలాగే మందలించినట్టు న్యాయమూర్తి చెప్పారు. ఓ లాయర్ విచారణ మధ్యలో సమోస తిన్నారని.. సమోస తినడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. అయితే.. అందరి ముందు తినలేరని, అలా అందరి ముందు తినాలనుకుంటే ముందు దానిని అందరికి ఇవ్వాలి.. లేదా తినడం మానేయాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
అయితే.. ఈ సంభాషణ చాలా సరదాగా సాగిందని ఆ విచారణలో పాల్గొన్న ఓ లాయర్ వెల్లడించారు. కాగా.. తనతో పాటు మరికొందరు అధికారులు ట్రాఫిక్ జంక్షన్ లో ఇద్దరు మహిళలను కొట్టారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ నిమిత్తం ఇన్ స్పెక్టర్ కోర్టుకు హాజరయ్యారు.