- రాష్ట్రపతి అభ్యర్థి ఓటమితో కేసీఆర్ పరిస్థితి?
- నేషనల్ పాలిటిక్స్ కేసీఆర్ తో సాధ్యమేనా?
- కేసీఆర్ కు రాజకీయాల పై తత్వం బోధపడిందా?
రాష్ట్రపతి ఎన్నికలతో కేసీఆర్ కు తత్వం బోధపడింది. కాంగ్రెస్ బలపరిచిన విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయనకు సొంత ప్రతిపక్షాలు వెన్నుపోటు పొడిచాయని అంటున్నారు. హైదరాబాద్ కు తీసుకొచ్చి మరీ యశ్వంత్ సిన్హాకు పెద్దపీట వేశారు కేసీఆర్. బీజేపీని తిట్టి ఆ పార్టీని ఓడిస్తానని శపథం చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో అది నెరవేరలేదు. కాంగ్రెస్ అంటేనే గిట్టని కేసీఆర్ బీజేపీ పై కోపంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారు. అయినా కూడా ఆయన గెలవకపోవడంతో ఏం తోచని పరిస్థితిలో పడ్డారు కేసీఆర్.
అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ఆరంగ్రేటం చేయడానికి రాష్ర్టపతి ఎన్నిక ఆయన తొలి అవకాశంగా భావించారు. దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ ఇదివరకే కలిసి వచ్చారు. కనుక ఈ ఎన్నికలో వాటన్నిటినీ తన నాయకత్వంలో ముందు నడిపించి.. తన సత్తా చాటుకోవాలనుకొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీతో అంతా తారుమారైంది. ఆయనే వాటికి దూరం కావలసివచ్చింది. అంతే కాదు… కాంగ్రెస్ లేకుండా విపక్షాలు కలిసి పనిచేయవనే విషయం కేసీఆర్‌కు స్పష్టంగా ఆర్డమైంది.
ఇక కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో తన తనయుడు కేటీఆర్‌ను యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు పంపారో తెలీదు కానీ.. ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ తదితరులు హాజరవడంతో కేటీఆర్ వెనకుండిపోవలసి వచ్చింది. అదో అవమానం. రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోబోతున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచి నగరానికి తొలిసారిగా వచ్చినట్లుగా కేసీఆర్ చేసిన హడావుడి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యశ్వంత్ సిన్హా ఓడిపోవడంతో రాష్ట్రంలోను, జాతీయ స్థాయిలోను బిజెపి ముందు కేసీఆర్ మరోసారి తలదించుకోవలసి వచ్చింది. కనుక ఈ విషయంలో ఆయన వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పవచ్చు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కు ఆలోచనలు కలలుగానే మిగిలేలా ఉన్నాయి. నాయకులకు భరోసా ఇవ్వడం..అంత తేలికైన విషయం కాదని అనుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలను ఏలుతున్న కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు అంత ఈజీ కావని అర్థమైంది. డిఫెరెంట్ మనుషులు దేశంలోని మనుషుల వ్యక్తిత్వాలను మేనేజ్ చేయడం సాధ్యం కాదని అర్థం అయినట్టుగా ఉంది.
రాష్ట్రపతి ఎన్నికల విజయంతో మోడీ సహా కేంద్రంలోని బీజేపీకి మరింత జోష్ వచ్చినట్టయింది. తాము వేస్తున్న వ్యూహాలు సక్సెస్ కావడం.. విపక్షాల మధ్య అనైక్యత.. వంటివి ఆ పార్టీకి పెట్టని కోటగా మారిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రావడం.. అనేది కేసీఆర్‌కు అంత ఈజీకాదని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయన తర్వాత స్టెప్ ఏంటనేది ఆసక్తిగా ఉంది.