సీఎంవో అంటే ఎంత పవర్ ఫుల్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది సీఎంవోకు ముఖ్య కార్యదర్శి అయితే…? పైగా సీఎంలు నలుగురు మారినా తను మాత్రం మారటం లేదు. అంతేనా 2013లో రిటైర్ అయిన ఆ అధికారికి ఇప్పటికీ తన సర్వీస్ పొడిగిస్తూనే ఉన్నారు. ఆయనే కేకే.
గుజరాత్ రాష్ట్రంలో సీఎంలుగా మోడీ, ఆనందిబెన్ పటేల్, విజయ్ రూపానీతో పాటు కొత్తగా సీఎం అయిన భూపేంద్ర పటేల్ వద్ద కూడా ఆయనే కొనసాగుతున్నారు. గుజరాత్ బీజేపీకి ఎంతో సుపరిచితుడైన ఆ అధికారి పూర్తి పేరు కునియిల్ కైలాశనాథన్. ప్రధాని నరేంద్రమోడీ ఎంతగానే నమ్మే అధికారి ఈయనే.
గుజరాత్ లో మోడీకి ఈయనే కళ్లు, చెవులు అనేవారు. 1979బ్యాచ్ కు చెందిన ఈయన 2013లోనే రిటైర్ అయినా ఇప్పటికీ తన పదవీకాలాన్ని పొడిగిస్తున్నారు. 2006 నుండి తను సీఎంవోలోనే పనిచేస్తున్నారు. అయితే 2014లో మోడీ ప్రధాని అయ్యాక తనకు ఎంతో నమ్మకమైన ఐఏఎస్ లు ఏ.కె శర్మ, హస్ముఖ్ అధియా, ముర్ము, సంజయ్ భవసర్, పీ.కే మిశ్రాలను గుజరాత్ నుండి పీఎంవోకు తీసుకెళ్లారు. కానీ కే.కే ను మాత్రం గుజరాత్ సీఎంవోలోనే ఉంచారు.
గుజరాత్ లో మోడీ సీఎంవోగా ఉన్న సమయంలో మోడీని-అదానీని కలిపింది ఈ కే.కేనే అంటుంటారు. గుజరాత్ లో అధికారికగా కేకే అద్భుతంగా పనిచేస్తూ మోడీ దృష్టిలో పడటంతో ఆనాటి నుండి ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు ఆనాటి నుండి మోడీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా కూడా కే.కే మారిపోయారు. సీఎంగా ఉన్న మోడీ… ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ కావటంలోనూ ఈయన పాత్ర చాలా ఉంటుందని చెబుతుంటారు.