ఓ మత బోధకుడి నిర్లక్ష్యం వల్ల 23 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 15 గ్రామాలను సీజ్ చేశారు. పంజాబ్ లో నమోదైన 33 కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో 23 మందికి అతని నిర్లక్ష్యం వల్లనే వ్యాపించింది. పంజాబ్ లోని గురుద్వారా లో మత బోధకుడిగా పని చేసే 70 ఏళ్ల వ్యక్తి ఇటీవల కరోనా వైరస్ తో చనిపోయాడు. అతను తన పొరుగు గ్రామాల నుంచి ఇద్దరు మిత్రులను తీసుకొని రెండు వారాలు జర్మనీ, ఇటలీలో పర్యటించారు. ఈ నెల 6న ఢిల్లీకి తిరిగొచ్చిన తర్వాత సెల్ఫ్ క్వారంటైన్ పాటించకుండా నేరుగా పంజాబ్ వెళ్లిపోయారు. అక్కడ పలు మత సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అతనికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు.
అధికారులు అతని మూమెంట్ ను ట్రాక్ చేయగా మార్చి 8-10 వరకు అతను ఆనంద్ పూర్ సాహిబ్ గురుద్వారలోని ఓ కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి అతని స్వగ్రామం షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాకు చేరుకున్నారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలే వరకు వందలాది మందిని కలుసుకున్నారు. అతను, అతని ఇద్దరు మిత్రులు రాష్ట్రంలోని 15 గ్రామాలకు వెళ్లారు.
మృతుని కుటుంబంలో 14 మందికి వైరస్ టెస్ట్ పాజిటివ్ గా తేలింది. అతని మనవరాలు, మనమడితో సహా చాలా మందికి వైరస్ వ్యాపించింది. అధికారులు మతబోధకుడు పర్యటించిన గ్రామాలను తిరుగుతూ అతనితో కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. నవన్ షహర్, మొహలీ, అమృత్ సర్, హోషియార్ పూర్, జలంధర్ లో పలువురు కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 కేసులు నమోదు కాగా.. 17 మంది చనిపోయారు.