కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తాత్కాలికంగా మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న స్కూల్స్ మూతపడగా… ప్రైవేటు టీచర్లు రోడ్డున పడ్డారు. ఉపాది లేక పస్తులుంటున్నారు.
తాజాగా జగిత్యాల కు చెందిన గడప చంద్ర శేఖర్ అనే ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు మీడియా ముందుకు వచ్చాడు. మా కుటుంబం ఆత్మహత్య చేసుకోకుండా కాపాడండి కెసిఆర్ గారు అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. 20 సంవత్సరాలుగా అరకొర జీతాలతో ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాను. జీతాలు లేకపోవడంతో అప్పులు చేశాము. అప్పుల వాళ్ళు ఇంటి పైకి వస్తున్నారు. నెల నెలా కట్టే ఈఎంఐలు సైతం కట్టలేకపోతున్నామన్నారు.
ఉండటానికి ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాము. ప్రైవేటు టీచర్ గా పని చేయడమే మేము చేసిన తప్పా కేసీఆర్ గారు… నా కూతురు ఇంటర్ వరకు చదివింది. డిగ్రీ చదవడానికి డబ్బులు లేవు. అలాగే నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రిలో చూపించేందుకు డబ్బులు లేవు. నా భార్య పిల్లలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం కూడా పెట్టలేక పోతున్నాను. నా కుటుంబం ఆత్మహత్య చేసుకోక ముందే మమ్మల్ని కాపాడండి సార్ అంటూ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా ఇప్పుడు ఇదే ఆవేదనతో… మా జీవితాలను నాశనం చేయకండి, ఆదుకోండి అంటూ ప్రభుత్వానికి కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.