నల్లమల అడవుల్లో అరుదైన, అందమైన పక్షి ప్రత్యక్షమైంది. దేశంలోనే అరుదైన పక్షిగా ఉన్న ‘బ్లాక్ బాజా’ తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. ఈ పక్షిని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ రిజర్వు అటవీ ప్రాంతం అమ్రాబాద్ మండలం మన్ననూరు రేంజి పరిధి నల్లమల అడవిలోని ఫరహబాద్ వద్ద గుర్తించినట్లు అమ్రాబాద్ అటవీశాఖ డివిజనల్ అధికారి రోహిత్ గోపి తెలిపారు. ఈ అరుదైన పక్షి తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ ఇలాంటి పక్షి కనిపించలేదని అన్నారు. ఈ పక్షులు చాలా అందంగా ఉంటాయని.. వాటి కన్నులు నలుపు రంగులో ఉంటాయని తెలిపారు. ఈ జాతి పక్షులు నార్త్ ఇండియాలో తూర్పు హిమాలయ ప్రాంతాలు, చైనా మరియు సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ఈ ‘బ్లాక్ బాజా’ పక్షులు..గద్దలు, రాబందుల జాతికి చెందినవని అన్నారు. ఇవి ఎక్కువగా కేరళ, మేఘాలయ మధ్య సంచరిస్తుంటాయని తెలిపారు. అక్కడి నుంచి నల్లమల ప్రాంతానికి వచ్చి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. అన్ని సంచార పక్షులకు నల్లమల అనువైన ప్రాంతంగా మారుతుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
చలి కాలంలో శ్రీలంక, కేరళ ప్రాంతాలకు వలస వస్తుంటాయన్నారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ప్రాంతానికి కూడా కేరళ ప్రాంతం నుండి వలస వచ్చి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నల్లమలలో పక్షుల గణనలో భాగంగా హైదరాబాద్ కు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మదన్ రెడ్డి ఫరహబాద్ వద్ద తన కెమెరాలో బంధించాడు అని ఆయన తెలిపారు.