విశ్వవిఖ్యాత నటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. నందమూరి తారకరామారావు చిత్రంతో రూ.100 కాయిన్ ను కేంద్రం త్వరలోనే ముద్రించనుంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా వెండితో రూ.100 కాయిన్ తయారు చేయనున్నట్లు సమాచారం. దీని కోసం మెంట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందేశ్వరిని కలిసి కాయిన్ నమూన చూపించి సలహాలు కోరారు. దీంతో త్వరలోనే ఎన్టీ రామారావు కాయిన్ అందుబాటులోకి రానుంది.
అయితే తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన నందమూరి తారకరామారావుకు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. నటుడిగా,రాజకీయ నాయకుడిగా తెలుగువారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. అయితే ఆయన వందో జయంతి సందర్భంగా ప్రస్తుతం ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు ఎన్టీఆర్ కుటుంబం నిర్వహిస్తోంది. దీంతో తొలిసారిగా అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది.