సాధారణంగా హీరోలు డబుల్ రోల్ చేయాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. అగ్ర హీరోలు ఈ విషయంలో భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నందమూరి హీరోలు మాత్రం మూడు పాత్రలు చేసే విషయంలో భయపడటం లేదు. రెండు కాదు మూడు పాత్రలు అయినా సమర్ధవంతంగా చేస్తాం అంటూ ధీమాగా ముందుకు వెళ్తున్నారు.
అప్పట్లో ఎన్టీఆర్ దాన వీర సూరకర్ణ సినిమాలో మూడు పాత్రలు చేసి సంచలనం సృష్టించారు. ఆ సినిమా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఇక నందమూరి బాలకృష్ణ ఒక్క మగాడు సినిమాలో మూడు పాత్రల్లో నటించారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే బాలకృష్ణకు మంచి మార్కులు పడ్డాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మూడు పాత్రల్లో తన సత్తా చాటుకున్నాడు.
జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ కొట్టింది. భారీ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఇలాగే ముందుకు వెళ్తున్నాడు. అమిగోస్ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్ కూడా విడుదల అయింది. ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు ఇలా మూడు పాత్రలు చేయడం ఇండియన్ సినిమాలో మొదటిసారి అంటున్నారు ఫాన్స్.