ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడట. పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన ఇంటి చోరీ ఇంచుమించు అలాంటిదే. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఓ చిట్టి దొంగ చేసిన చోరీ ఇది. దొంగను కనిపెట్టిన యజమానికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.తూర్పు మిడ్నాపూర్‌లో ఓ కిరాణా దుకాణంలో నగదు డ్రాయర్‌లోంచి సుమారు రూ.13వేలు కొట్టేసింది ఓ చిట్టెలుక. నగదు డ్రాయర్‌లోని గ్యాప్‌లో ఉన్న కరెన్సీ నోట్లను ఎలుక కొరికి తన గూట్లో పెట్టుకుంది.
ఈ ఘటన అంతా షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దుకాణ యజమాని ఎలుకల బొరియ నుంచి రూ.12,700 తీయగలిగాడు.
తమ్లుక్ మార్కెట్‌లోని ఓ దుకాణం యజమాని అమల్ కుమార్ మైతీ ఇన్సిడెంట్ జరిగిన ముందు రాత్రి యథావిధిగా తన దుకాణాన్ని మూసివేసాడు.మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు దుకాణానికి వచ్చి నగదు డ్రాయర్(టెబుల్ డెస్క్) తెరవగా డబ్బులు దొంగతనం జరిగినట్లు గ్రహించాడు.
ఆ సమయంలో ఆ షాపులో పనిచేసే ఉద్యోగి ఉన్నాడు. కానీ యజమానికి ఆ ఉద్యోగిపై అనుమానం లేదు. పైగా తన దగ్గరే డ్రాయర్ తాళం ఉంది. డ్రాయర్ ఓపెన్ చేసినట్లు లేదు. నగదు తప్పిపోయిన విషయాన్ని మైతీ ఇతర వ్యాపారులకు తెలియజేశాడు.
అందరూ తన దుకాణానికి వచ్చి గుమిగూడారు. ఈ విషయమై చర్చించి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ముందు, ఓ సారి CCTV ఫుటేజీని తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ సమయంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అప్పుడే పక్క షాపు వాళ్లు మరోమారు ఫుటేజీని మళ్లీ తనిఖీ చేయమని అడిగారు.దుకాణంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ్యాపారులు ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు.
CCTV రికార్డింగ్‌ని చూడటం మానేయబోతున్న సమయంలో, ఒక దుకాణదారుడు అకస్మాత్తుగా కెమెరాలలోని ఒకదాని నుండి ఫుటేజీని రివైండ్ చేయమని అడిగాడు.
దాన్ని మళ్లీ చూస్తున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఉదయం 7 గంటలకు, ఎలుక డ్రాయర్‌లోంచి డబ్బు తీయడం కనిపించింది. అందులోని నగదును తన కన్నంలోకి లాక్కెళ్లింది.
కొద్దిసేపటికి అతను మళ్లీ బయటకు వచ్చి నగదు డ్రాయర్ వద్దకు వెళ్లింది. ఇలా రూ.13వేలను తన బొరిగలోకి లాక్కెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన వారంతా షాక్ గురయ్యారు.