కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి లక్షకోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాచిగూడలోని అభినందన్ గ్రాండ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణయ్య హాజరై మాట్లాడారు.
దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కనీసం 5 శాతం బడ్జెట్ కేటాయించరా..? అని ప్రశ్నించారు. గతేడాది కేంద్రం బీసీలకు రూ.1,050 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. ఇది దేశంలో 70 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు కూడా రావని ఎద్దేవాచేశారు. బడ్జెట్ లో బీసీలకు లక్షకోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. బీసీ సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని అన్నారు క్రిష్ణయ్య. రాష్ట్రంలో కేంద్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లను కేటాయించాలని అన్నారు. పిల్లికి బిచ్చం వేసినట్టు ఒకటి రెండు సీట్లను కేటాయించి బీసీలకు తామేదో చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆర్ క్రిష్ణయ్య.