సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బుధవారం మరో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నారు.
ముందుగా హైదరాబాద్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న కారు ఇబ్రహీంనగర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు.
అలాగే ప్రమాదం జరిగిన స్థలం వద్దే విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో కూడా ప్రమాదానికి గురయ్యింది. మోడల్ స్కూల్ విద్యార్థులను స్కూల్ కు తీసుకెళ్తున్న ఆటో.. ప్రమాద స్థలం వద్ద స్లో కాగా, వెనక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని హుటాహుటిన సిద్దిపేట జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీష్ రావు జీజీహెచ్ కు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.