ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ఓ బావిలో శివలింగం బయటపడింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హిందూ మహిళల తరఫు న్యాయవాది వెంటనే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కోర్టు.. ఆ ప్రాంతాన్ని సీల్ చేసి, అక్కడకు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అక్కడ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని వారాణసీ కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌ను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ ఆదేశించారు.
ప్రఖ్యాత కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ లో మసీదు వెనుక పూర్వం ఆలయం ఉండేదని.. అక్కడ నిత్య పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. ఇందుకోసం కలెక్టర్, ఇరు పక్షాల న్యాయవాదులతో ఓ కమిషన్‌ను నియమించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 6న సర్వే ప్రారంభించారు. అయితే.. మసీదు ప్రాంగణంలో వీడి యో తీయరాదని అడ్డుకోవడంతో సర్వే ఆగిపోయింది.
కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కాంప్లెక్సులో శనివారం నుంచి మూడు రోజులు వీడియోగ్రఫీ సర్వే చేశారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు సర్వే పూర్తి చేశారు. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని బావిలో నీటిని తోడగా అందులో శివలింగం బయటపడినట్టు హిందూ మహిళల తరఫు న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది వెల్లడించారు. శుద్ధి కార్యక్రమాల కోసం వాడుకుంటున్న ఈ బావిని సీల్ చేయాలంటూ ఆయన వెంటనే కోర్టును ఆశ్రయించారు.
శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేసి భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా, మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడిన విషయాన్ని వారాణసీ కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ ధ్రువీకరించలేదు. సర్వే వివరాలను కమిషన్ సభ్యులెవరూ వెల్లడించరాదని మీడియాకు తెలిపారు. మంగళవారం కోర్టుకు సర్వే నివేదికను సమర్పిస్తామని తెలిపారు. కాగా సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మంగళవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.