20లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన ప్రధాని మోడీ అందులో భాగంగా రైతంగానికి 2లక్షల రుణ సదుపాయాన్ని కల్పించారు. వరుసగా రెండో రోజు ప్రజల ముందుకు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్… 2.5కోట్ల మందికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
నాబార్డు ద్వారా 30 వేల కోట్ల ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ తో పాటు 90 వేల కోట్ల వార్షిక కేటాయింపులకు ఇది అదనమని తెలిపారు. లోన్స్‌ను సమయం ప్రకారం తిరిగి చెల్లిస్తున్న రైతులకు వడ్డీ తగ్గింపుతో అందించే రుణాలను మే 31 వరకు పొడిగిస్తున్నామన్నారు.
పీపీపీ మోడ్ లో పట్టణ హౌజింగ్ ప్రోగ్రాం తయారు చేస్తున్నామని… తద్వారా పట్టణాల్లో అద్దెలు ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దీని కోసం ప్రత్యేక పథకాన్ని తయారు చేసి త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. ఇక 50లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరేలా 5వేల కోట్ల నిధులు అందిస్తున్నామన్నారు. ఇక వీరు ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు 10వేల రుణం అందిస్తామని ప్రకటించారు. ఒక్క నెల రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తామని ప్రకటించారు.
వలస కార్మికులకు ఉచితంగానే 2 నెలలపాటు రేషన్ అందిస్తామని నిర్మలమ్మ తెలిపారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే.. వారికి కూడా 5 కేజీల గోధుమలు అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం 3,500 కోట్లు కేంద్రమే భరిస్తుందని పేర్కొన్నారు.