ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ నిరసనలు చెలరేగాయి. పోలీసుల అంచనాలను తలకిందులు చేస్తూ.. నిరసనకారులు వేలాదిగా రోడ్లపైకి రావడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. నిరసన కారులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.
అందులో భాగంగా వంద మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అమలాపురంలో అదనపు బలగాలను ఏర్పాటు చేస్తూ.. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు.
నిరసనకారులు పట్టణంలోకి ప్రవేశించకుండా అన్ని మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
ఆందోళనకారుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉంటాయని.. ర్యాలీలుచ, నిరసనలు బహిరంగ సభలకు అనుమతి లేదన్న పోలీసులు స్పష్టం చేశారు.