ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు మానవత్వాన్ని చాటుకున్నాడో ట్రాఫిక్ కానిస్టేబుల్. దీంతో ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టి అందరి ప్రసంశలందుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సులో బాలాజీ అనే వ్యక్తి ఎల్బీనగర్ నుంచి ఆరంఘర్ వైపు ప్రయాణిస్తున్నాడు. అయితే ఆరంఘర్ చౌరస్తాలో బస్సు దిగగానే.. బాలాజీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో అతను నడిరోడ్డు మీదే కుప్పకూలిపోయాడు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే స్పందించాడు.
పరుగున అతని దగ్గరికెళ్ళి.. అతని ఛాతీపై గట్టిగా ప్రెస్ చేసి బాలాజీ ప్రాణాన్ని కాపాడాడు. అయితే రాజశేఖర్ చేసిన ప్రాథమిక చర్యతో ప్రాణాలతో బయటపడ్డ బాలాజీని వెంటనే అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి అందరూ సెల్యూట్ కొడుతున్నారు.