కర్ణాటకలో ఓ వైద్యునికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల కల్బుర్గికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అతను కల్బుర్గిలో చికిత్స పొందుతోన్న సమయంలో వైద్యుడు రోగితో సంప్రదింపులు జరపడంతో ఆ డాక్టర్ కు కూడా కరోనా సోకిందని కర్ణాటక వైద్య అధికారులు అనుమానిస్తున్నారు.
యూకే నుంచి కర్ణాటకకు చెందిన ఓ భారతీయ విద్యార్ధి ఇటీవల స్వదేశానికి వచ్చింది. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ రంగంలో పనిచేసే ఆమె మామయ్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.టెస్టులు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్ అని తేల్చారు. దాంతో ఆమెను ఇంట్లోనే ఉంచి వైద్య సహాయం అందించారు. ఆమెను పరీక్షల కోసం ఆసుపత్రికి ఆమె మామయ్య తీసుకెళ్లడంతో అతను కూడా కరోనా బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు.
కర్ణాటకలో కరోనా కేసులు పదుల సంఖ్యలో నమోదు అయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్ తో కల్బుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు మరణించాడు. అయితే మృతుడికి ఇది వరకు బీపీ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడు. అతని రక్తనమూనాలను పరీక్షించిన వైద్యులు అతను కరోనా వైరస్ సోకి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కరోనాతో భారత్‌లో తొలి మరణం కర్ణాటకలో నమోదు అయింది. కాగా రెండవ మరణం ఢీల్లీలో నమోదు అయింది. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల వృద్ధ మహిళ కారోనాన్నతో మృతి చెందింది. మంగళవారం మూడవ మరణం మహారాష్ట్ర నుండి నిర్ధారించబడింది. ముంబైకి చెందిన 64 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వైద్య అధికారులు దృవీకరించారు.
కర్ణాటకలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో యడ్యూరప్ప సర్కార్ అప్రమమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పబ్బులు, మాల్స్, థియేటర్లు మూసివేయమని ఆదేశించింది. అలాగే ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించమని బెంగళూరులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) సంస్థలకు సలహా ఇచ్చింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 10 కి చేరుకున్నందున, వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి త్వరలో కొత్త చర్యలు అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.