– బీజేపీ, ప్రతిపక్షనేతల మధ్య మాటల యుద్ధం
– ఒకరిపై ఒకరు ట్వీట్ వార్
– మరోసారి తెరమీదకు బుల్డోజర్ వివాదం
– కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చేసిన ట్వీట్ కు బీజేపీ ఆగ్రహం
– బుల్డోజర్ రాజకీయాలను మొదలుపెట్టింది ఇందిరాగాంధీనే
– కాంగ్రెస్ నేతలు ఆమెనేసియాతో బాధపడుతున్నారు
– బీజేపీ నేత అమిత్ మాలవీయ వరస ట్వీట్ లు
ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన బుల్డోజర్ల రాజకీయ వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది. దీనిపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సైతం కొనసాగుతూనే ఉంది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొనే బీజేపీ ప్రభుత్వాలు బుల్లడోజర్లు నడిపిస్తున్నాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆదివారం చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆయన ట్వీట్ కు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.
తుర్క్‌మాన్ గేట్ వద్ద మైనారిటీలపై బుల్డోజర్లు నడిపాలంటూ మొట్టమొదట ఆదేశాలిచ్చింది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీనేనని బీజేపీ జాతీయ సమాచార, సాంకేతక విభాగం ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఈ మేరకు వరస ట్వీట్ లు చేస్తూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాలవీయ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనీష్ తివారీ నుంచి రాహుల్ గాంధీ వరకూ ఆమెనేసియాతో బాధపడుతున్నట్టున్నారని ట్వీట్టర్ లో రాశారు.
లేదంటే గతానికి సంబంధించిన సరైన సమాచారం వారివద్ద లేకపోయి అయినా ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. నాజీలు, యూదులపై విస్తృతంగా బుల్డోజర్లు మోహరించారని, యూదులు ఆ తరువాత పాలస్తీనా వారిపై వాటిని ఉపయోగించారని పేర్కొంటూ.. ఓ ఆర్టికల్ ను మనీష్ తివారీ ట్విట్టర్ లో షేర్ చేశారు. దానికి స్పందించిన మాలవీయ.. నాజీలు, యూదుల గురించి పక్కనపెట్టాలని మండిపడ్డారు. ఇండియాలోనే మొదటిసారిగా మైనారిటీలపై తుర్కమాన్ గేట్ వద్ద బుల్డోజర్లు ఉపయోగించాలని ఆదేశించిన ఘనత ఇందిరాగాంధీదే అని ఆరోపిస్తూ దానికి సంబంధించిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
1976 ఏప్రిల్ లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ముస్లిం మహిళలు, పురుషుల చేత బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అందుకు విరుద్దంగా నిరసనకు దిగిన వారిపై.. తుర్కమాన్ గేట్ వద్ద బుల్డోజర్లు నడిపారని ఆరోపించారు మాలవీయ. ఈ ఘటనలో 20 మంది ప్రజలు చనిపోయారనే చరిత్రను గుర్తుచేసుకోవాలని మాలవీయ మరో ట్వీట్ చేశారు.