మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ ఓ వార్డు మెంబర్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని 3వ వార్డు సభ్యుడు తుపాకుల రవికుమార్.. మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి దిగి నిరసన తెలియజేశాడు.
గత 15 రోజులుగా గ్రామంలోని పలు వార్డులకు నీళ్లు సరఫరా కావడం లేదన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీళ్లను అందిస్తుంటే.. ఇక్కడి అధికారులు మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని తెలిపాడు. గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు లోపలికి వెళ్లి నీళ్లల్లో నిరసన తెలియజేశాడు.
ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని.. అందుకే చివరకు చేసేదేమీ లేక, అధికారుల తీరును తప్పుపడుతూ.. వినూత్నంగా నిరసన చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశాడు.