తమ భూ సమస్యలను పరిష్కరించాలని ఓ మహిళ జగిత్యాల జిల్లాలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన యాచమనేని సత్య నారాయణ రావు, మమత భార్యభర్తలు.
సత్య నారాయణ తల్లి రామక్క పేరు మీద ఒక ఇల్లు, 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సత్యనారాయణ రావుకు ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. ఆరు నెలల క్రితం వారి తల్లి చనిపోయింది. దీంతో ముగ్గురు కూతుళ్లు తల్లి ఆస్తిలో వాటా కోరుతూ సత్యనారాయణ దంపతులకు లీగల్ నోటీసులు పంపించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాచమనేని మమత.. ఇవాళ ఉదయం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పబ్బ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భూ సమస్యను పరిష్కరిస్తామని ఎస్ఐ పబ్బ కిరణ్ హామీ ఇవ్వడంతో మమత టవర్ నుంచి కిందకు దిగింది.