వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. అమెరికాలో ఉద్యోగాలు. ఏ విషయంలోనూ లోటులేదు. కానీ ఊహించని ఉపద్రవం.. వీరి సంసారాన్ని కాలరాసింది. భర్తను గుండెపోటు తీసుకుపోగా..అతడు లేని లైఫ్ తనకు వద్దనుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ డీడీ కాలనీలో ఉంటున్న సాహితీ(29)కి, వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్ వేర్‌తో ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. వీరిద్దరూ అమెరికాలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల రెండు సాహితీ అమెరికా నుండి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే ఈ నెల 20న మనోజ్ గుండె పోటుతో అమెరికాలో తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని సాహితీ జీర్ణించుకోలేకపోయింది. అతడి మృతదేహాన్ని 23వ తేదీన భారత్‌కు తీసుకువచ్చారు. 24వ తేదీన బంధుమిత్రులు, సన్నిహితుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త మరణ వార్త నుండి సాహితీ కోలుకోలేదు. భర్త అంత్యక్రియలు అయిపోయిన తర్వాత పుట్టింటికి వచ్చేసింది సాహితీ. అయితే రాత్రి సాహితీ, ఆమె చెల్లెలు సంజన ఒకే రూములో పడుకున్నారు. గురువారం ఉదయం 9 గంటల తర్వాత లేచిన సంజన.. వాష్ రూముకు వెళ్లింది.
10 నిమిషాల తర్వాత వచ్చి చూడగా.. లోపల గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా సాహితీ రెస్పాన్స్ కాలేదు. అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా..అక్క సాహితీ ఉరికి వేలాడుతుంది. ఆమె బాత్రూముకు వెళ్లగానే చీరతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది సాహితీ. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.