ఆయన ఓ మాజీ మంత్రి.. ప్రస్తుతం అదికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. మొన్నటి వరకు మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు.. కానీ నిరాశే మిగిలింది. ఇక నియోజకవర్గంలో పూర్తి పట్టు సాదించుకుని మరో సారి గెలుపు కోసం బాటలు వేసుకోవాలని తపించాడు. కానీ ఇటీవల పార్టీలో చేరిన ఓ యువ పారిశ్రామిక వేత్త ఆయన కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో ఆ మాజీ మంత్రి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసేది నేనేనంటూ ప్రచారం చేసుకుంటూ… వివిద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. మాజీ మంత్రికి కొరకరాని కొయ్యలా మారిన ఆ యువనాయుడు ఎవరు..? మాజీ మంత్రిని వణికించేంత సత్తా ఆ యువ పారిశ్రామిక వేత్తకు నిజంగానే ఉందా…? తొలివెలుగు ప్రత్యేక కథనం…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మాజీ మంత్రు లిద్దరూ ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆ ఇద్దరు… ప్రత్యర్థుల పార్టీల నుంచి కంటే సొంత పార్టీల వారితోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో ఒకరు జూపల్లి కృష్ణారావు కాగా మరొకరు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. గత ఎన్నికల్లో ఓటమి చెందడం జూపల్లి కి కష్టాలు తెచ్చిపెడితే… ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కక పోవడం లక్ష్మారెడ్డి కి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఐతే లక్ష్మారెడ్డి మాత్రం తన కష్టాలను తానే కొనితెచ్చుకున్నారని ఇప్పుడు జడ్చర్ల నియోజకవర్గంలోని కారు గుర్తు కార్యకర్తలు కోడై కూస్తున్నారు. రాజకీయ అనుభవం ఏమాత్రం లేని పారిశ్రామిక వేత్త మన్నె శ్రీనివాస్ రెడ్డి కుటుంబీకులను తన ప్రోత్సాహంతో మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించుకుని శభాష్ అనిపించుకున్నారు. కానీ ఆ ఫ్యామిలీతోనే ఇప్పుడు లక్ష్మారెడ్డికి ముప్పు ఏర్పడిందని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు గుసగుస లాడుకుంటున్నారు. ఇందుకు కారణం ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడు జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున జడ్చర్ల నుంచి పోటీ చేస్తాడంటూ వస్తున్న పుకార్లే. జీవన్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టడం ఈ పుకార్లకు బలం చేకూర్చాయి.
మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో మొదట జీవన్ రెడ్డీనే పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ వ్యాపార రీత్యా అది సాధ్యం కాలేదని తెలిసింది. ఈ నేపధ్యంలో మొదట తన బాబాయ్ ఐన మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. పారిశ్రామిక వేత్తలు కావడంతో గెలుపు కోసం బాగానే ఖర్చు చేశారన్న పుకార్లు లేకపోలేదు. ఐతే మొదట బావించినట్టుగానే జీవన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు తన సొంత నియోజకవర్గమైన జడ్చర్ల నియోజవర్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. మొదట తన సొంత మండలం నవాబుపేట నుంచి కార్యకర్తలను తన వైపు మళ్లించుకోవడానికి శ్రీకారం చుట్టారు జీవన్ రెడ్డి. నవాబుపేటలో ఇటీవల సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సదర్ ఉత్సవాలకు కావాల్సిన డబ్బులను జీవన్ రెడ్డి సమకూర్చినట్టు సమాచారం. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారట సదర్ ఉత్సవ నిర్వాహకులు. అంతేకాదు జీవన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను జడ్చర్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బ్లడ్ క్యాంపు సైతం ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డి మెల్ల మెల్లగా పార్టీలో ముందుకుపోతున్నారు. దీంతో ఒక్కసారిగా మేల్కొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి…. జీవన్ రెడ్డిపై ఆరా తీయడం ప్రారంభించారు. సదర్ ఉత్సవాలు, జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ కార్యకర్తలను పిలిపించుకుని మట్లాడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీలో తానే టికెట్ తెచ్చుకుంటానని జీవన్ రెడ్డి చెప్పుకున్నట్టు కార్యకర్తలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి చెప్పడంతో లక్ష్మారెడ్డి తేరుకున్నారు.
తన నియోజకవర్గంలో జీవన్ రెడ్డి చాపకింద నీరులా చొచ్చుకుపోతుండటంతో లక్ష్మారెడ్డి అలర్ట్ అయ్యాడు. మంత్రి పదవి రాలేదన్న కారణంతో నియోజవర్గం ను పట్టించుకోకుండా హైద్రాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్న లక్ష్మారెడ్డి ఒక్కసారిగా మళ్లీ జడ్చర్ల బాటపట్టాడు. తన పట్టు ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకునేందుకు వారం రోజుల క్రితం తన పుట్టిన రోజువేడుకలను ఘనంగా జరుపుకొని రుజువు చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా జడ్చర్ల నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షల ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ఇక వందలాది మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. అయితే ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి కానీ, అతని సోదరుడి కొడుకు జీవన్ రెడ్డీ లు ఈ పుట్టిన రోజువేడుకలకు హాజరు కాలేదు.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి చెక్ పెట్టాలని అనూహ్యంగా మన్నె శ్రీనివాస్ రెడ్డి ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇందులో కీలక పాత్ర కూడా లక్ష్మారెడ్డి దేనని తెలిసింది. మరి ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా కేసీఆర్ మన్నె శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినప్పుడు.. అదే కుటుంబంలోని జీవన్ రెడ్డికి టికెట్ ఎందుకు సాధ్యం కాదు అన్న ప్రశ్న ఇప్పుడు జడ్చర్లలో హాట్ టాపిగ్ గా మారింది. మొత్తానికి జడ్చర్లలో లక్ష్మారెడ్డికి, యువ నాయకుడు జీవన్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తుంది.