ఒక్కోసారి అరుదైన పోలీస్ కేసులు నమోదవుతుంటాయి. నోయిడాలో మొన్నామధ్యన కుక్క కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నిన్నకాక మొన్న చెన్నైలో తన గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వడం కోసం కుక్క పిల్లను దొంగిలించి అరెస్టయ్యాడు ఓ ప్రేమికుడు. తాజాగా ఓ వ్యక్తి ముద్దుగా పెంచుకుంటున్న పిల్లిని ఎత్తుకుపోయిన కేసు హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫైల్ అయింది.
ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న తన పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడని పోలీసుల ముందు వాపోయాడు దాని ఓనర్. పిల్లే కదా.. లైట్ తీసుకోవచ్చు అని స్థానికులు ఇచ్చిన ఉచిత సలహాకి గట్టి కౌంటరిచ్చాడు. అంతేకాదు.. దాని ప్రత్యేకతలు చెప్పుకొచ్చాడు.
అది హౌమనీ రకానికి చెందిన ఓ అరుదైన జాతి పిల్లట. ఒక కన్ను బ్లూ, మరోకన్ను గ్రీన్ ఉండటం దీని ప్రత్యేకతట. 18 నెలల ఈ పెంపుడు పిల్లి.. సుమారు రూ.50 వేల ఖరీదు ఉంటుందని వెల్లడించాడు.
కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దగ్గరలోని సీసీకెమెరాలను పరిశీలించారు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆడుకుంటున్న పిల్లిని బలవంతంగా తీసుకెళ్ళినట్లు సీసీ కెమెరాలో కనిపించింది. అతడి కోసం వెతుకులాట మొదలుపెట్టారు ఖాకీలు.